15 రోజుల్లో అర్హులందరికీ అక్రిడిటేషన్ లు
- జర్నలిస్టుల సమస్యలపై కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ భారీ ఆందోళన
ఖమ్మం, ఆంధ్రప్రభ : పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ లు 15 రోజుల్లో ఇస్తామని, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర హామీ టీడబ్ల్యూజేఎఫ్ నేతలకు ఇచ్చారు. ఈ మేరకు జిల్లా సమాచారశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – 2843) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వందమంది వరకూ జర్నలిస్టులు గంట సేపటికి పైగా ఆందోళన నిర్వహించారు.
జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించే వరకూ పోరాటం : టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఖదీర్, శ్రీనివాసరెడ్డి
జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించే వరకూ పోరాటం నిర్వహిస్తామని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15న హైదరాబాద్ లోని సమాచార శాఖ కమిషనరేట్ వద్ద నిర్వహించే ఆందోళనకు జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలి రావలసిందిగా పిలుపునిచ్చారు. చాలీచాలని వేతనాలతో.. ఆర్థిక ఇబ్బందుల నడుమ కిరాయి ఇండ్లలో జీవిస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులకు సరిపడా అక్రిడిటేషన్ల ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వివిధ సర్టిఫికెట్ల పేరుతో రకరకాల కొర్రీలు పెట్టుతుండడం వల్ల అనేకమంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ లకు దూరమవుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రాలు, మున్సిపల్ సెంటర్లలో పని చేస్తున్న బీట్ రిపోర్టర్లందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దువ్వాసాగర్, సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, టీబీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుకొండ రవికిరణ్, సీనియర్ నాయకులు పారుపల్లి కృష్ణారావు, స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు చీనేని బాలకృష్ణ, సంతోష్ చక్రవర్తి, నలుబోల మధు శ్రీ, షేక్ జానీ పాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కొరకొప్పుల రాంబాబు, గణేష్, గంగాధర్, నాగిరెడ్డి, అంజయ్య, బంకా వెంకటేశ్వర్లు, నాయకులు యాస లక్ష్మారెడ్డి, బండి కుమార్, పత్తి శ్రీనివాస్, అంజద్, శరత్, అర్షద్, గోపీ కృష్ణ, అశోక్ రెడ్డి, వీసారపు అంజయ్య, ఉపేందర్, కె.కిరణ్, గోపీ, షకీల్, సునీత, నాగలక్ష్మి, చంద్రశేఖర్, ధనాలకోట రవికుమార్, జావీద్, వీరారెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
