సింగపూర్ చెస్‌లో విజయవాడ చిన్నారి రాగ్వికకు డబుల్ మెడల్స్
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడకు చెందిన ఎనిమిదేళ్ల చెస్ క్రీడాకారిణి యెర్నేని రాగ్విక సింగపూర్‌లో జరిగిన ఫిడే రేటింగ్ చెస్ టోర్నీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. అండర్-8 బాలికల విభాగంలో ర్యాపిడ్ విభాగంలో రజత పతకం, స్టాండర్డ్ విభాగంలో కాంస్య పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది. తాడిగడపలోని నెక్స్ట్ జెన్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న రాగ్విక, కోచ్‌లు బండారు మహాలక్ష్మి, కనగర్ల గుణశేఖర్ శిక్షణలో ఈ విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా కృష్ణా యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఎం.వి. బసవేశ్వరరావు మచిలీపట్నంలో రాగ్వికతో పాటు ఆమె కోచ్‌లు, తండ్రి యెర్నేని రత్నప్రసాద్ను ఘనంగా సత్కరించి అభినందించారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించడం విశేషమని కొనియాడారు.
