శివాలయాలకు పోటెత్తిన భక్తజనం..

  • మహాశైవాక్షయోగం.. మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం కలయికతో ప్రత్యేక పూజలు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహాశైవాక్షయోగం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, సోమవారం ఒకే రోజు రావడంతో పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, బిల్వదళాలతో శివారాధన చేసి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చిదంబర శర్మ మాట్లాడుతూ, మహాశైవాక్షయోగం రోజున శివునికి భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు చేయడం వల్ల వంద మహాశివరాత్రులు ఆచరించినంత పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. ఈ రోజున శివారాధన చేయడం ద్వారా సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలు చేకూరుతాయని పేర్కొన్నారు.