సిగాచి ఘటనపై హరీష్ రావు వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
- మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి
- బాధితులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించిందని వెల్లడి
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సిగాచి ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించినప్పటికీ, బీఆర్ఎస్ నేత టి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు.
మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సిగాచి ప్రమాదంలో 54 మంది మృతి చెందగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం వెంటనే అందజేసిందని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించడంతో పాటు బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ విషయంలో అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హరీష్ రావుకు సూచించారు.
సిగాచి ప్రమాద ఘటనపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఏం మాట్లాడాలో తెలియక ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించడం కూడా సరికాదని విమర్శించారు.
గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు బస్సు ప్రమాదంలో సుమారు 66 మంది మరణించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదని పేర్కొన్నారు. అలాంటి నేతలు ప్రస్తుతం బాధితులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, పిల్లి మల్లికార్జున్, లక్ష్మీపతి గౌడ్, దుబాసి మల్లేష్, మధుకర్ గౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
