మేడారంలో తప్పిపోయిన చిన్నారులు.. పోలీసుల చురుకుతో క్షేమం

మేడారంలో తప్పిపోయిన చిన్నారులు.. పోలీసుల చురుకుతో క్షేమం
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను పోలీసులు 30 నిమిషాల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నార్లపూర్ ఎస్సై కమలాకర్ చొరవను స్థానికులు అభినందించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబం మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దీక్షిత్ (5), చేతన్ (7), వేక్షిత్ (4) తల్లిదండ్రుల నుంచి విడిపోయారు.
పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మేడారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎస్సై కమలాకర్ తన సిబ్బందితో కలిసి జాతర పరిసరాల్లో గాలింపు చేపట్టారు. మైక్ అనౌన్స్‌మెంట్ చేయించడంతో పాటు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసుల గాలింపులో జంపన్న వాగు వద్ద ఏడుస్తూ కనిపించిన ముగ్గురు చిన్నారులను గుర్తించారు.
చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి భయం పోగొట్టిన పోలీసులు, వారిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అప్పటికే స్టేషన్‌లో ఉన్న తల్లిదండ్రులకు ఎస్సై కమలాకర్ స్వయంగా పిల్లలను అప్పగించారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. సకాలంలో స్పందించి చిన్నారులను కాపాడిన ఎస్సై కమలాకర్, పోలీస్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
