చిన్నారుల భద్రతకు శక్తి టీం అవగాహన
గుడ్ టచ్–బ్యాడ్ టచ్, 112, శక్తి యాప్‌పై విద్యార్థులకు వివరాలు
నందికొట్కూరు, జూలై 14 (ఆంధ్రప్రభ): చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షియోరాన్ ప్రత్యేక చొరవతో జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ ఆదేశాల మేరకు ఆత్మకూరు సబ్‌డివిజన్ శక్తి టీం సభ్యులు మంగళవారం నందికొట్కూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ రెడ్డి అనుమతితో, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు సమక్షంలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అపరిచితులు చాక్లెట్లు, బిస్కెట్లు, బొమ్మలు ఇస్తామని చెప్పి దగ్గరకు పిలిచినా వెళ్లవద్దని, వెంటనే ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అనంతరం పాఠశాల సిబ్బందికి శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం లేదా అత్యవసర పరిస్థితుల్లో ఫొటోలు, లొకేషన్‌తో పోలీసులకు ఎలా పంపించాలో వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే తక్షణమే పోలీసు సహాయం అందుతుందని తెలిపారు.
చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి పాఠశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు శాఖ చొరవను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు. ఎస్పీ సునీల్ షియోరాన్ చేపట్టిన ఈ కార్యక్రమం చిన్నారుల్లో అప్రమత్తత పెంచడంలో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
