99.95 శాతం ఓటరు వివరాల డిజిటలైజేషన్
- జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం తుది దశకు చేరుకుందని, ఓటరు వివరాల డిజిటలైజేషన్ ఇప్పటికే 99.95 శాతానికి పూర్తయిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నారని చెప్పారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లకు గాను 13,39,675 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, ఇది 99.97 శాతం పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 13,39,054 ఫారాలను డిజిటలైజ్ చేయడంతో పురోగతి 99.92 శాతానికి చేరిందని వివరించారు.

నియోజకవర్గాల వారీగా నగరిలో, చిత్తూరులో, జీడీ నెల్లూరులో 100 శాతం, పలమనేరులో 99.99 శాతం, పూతలపట్టులో 99.95 శాతం, కుప్పంలో 99.59 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు 41,503 మంది మరణించిన ఓటర్లు, 53,694 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 17,675 మంది ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 21,865 మంది గైర్హాజరు ఓటర్లు, 197 ఇతర కేసులు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 1,34,934 మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించామని, తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు.

జిల్లాలో 1,511 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఓటరు వివరాల్లో మార్పులు, సవరణలు అవసరమైన వారు ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ’ సేవను వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, డీఆర్వో కె. మోహన్ కుమార్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.
