దేవాదుల ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం:
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : దేవాదుల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరత లేకుండా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పంపింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ ప్రాజెక్టును సోమవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి సందర్శించి దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యమైన 38.16 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించి 22 రిజర్వాయర్లను పూర్తిస్థాయిలో నింపి దేవాదుల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నామని, పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేసినట్లు తెలిపారు.
ఎల్‌నినో పరిస్థితులను ముందుగానే దృష్టిలో ఉంచుకుని గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేలా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మంత్రులు ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ, మోటార్ల పనితీరు, నీటి నిల్వలు, భూసేకరణ, పెండింగ్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వస్సల్ టోప్పో, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
