బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
దండెపల్లి, ఆంధ్రప్రభ : దండెపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బాణావత్ నర్సింహా నాయక్ ఇటీవల మృతి చెందగా, సోమవారం కార్మిక, గనుల, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనను తుగ్లక్ పాలనగా అభివర్ణిస్తూ, రాష్ట్ర వనరులను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిందని ఆరోపించారు.
‘రూ.1,400 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?’: కేసీఆర్‌ను నిలదీసిన మంత్రి
కేసీఆర్ ఆర్థిక ఎదుగుదలపై ప్రశ్నలు లేవనెత్తిన మంత్రి, రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఆయన వద్ద ఆస్తులు లేకపోయాయని, ప్రస్తుతం ఒకే కుటుంబం వద్ద రూ.1,400 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తండ్రి ఒక మాట, కొడుకు మరో మాట చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కూడా రూ.1,400 కోట్ల ఆస్తులపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
