Kaleshwaram | కాళేశ్వరంపై అఖిలపక్ష సమావేశం పెట్టండి
బండి సంజయ్‌పై జగ్గారెడ్డి ఫైర్
Kaleshwaram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని జగ్గారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజకీయ సంబంధాలు కొనసాగించిందని ఆయన ఆరోపించారు. ఆ కాలంలో కేంద్ర జలవనరుల శాఖ బీజేపీ ఆధ్వర్యంలోనే ఉన్నప్పటికీ ప్రాజెక్టు అంశంపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బండి సంజయ్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీశ్‌రావుకు పట్టిన “రోగమే” బండి సంజయ్‌కూ పట్టిందంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తగిన శిక్షణ ఇవ్వకుండానే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిని చేశారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ఆరోపణలు కాకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు.
