విద్యుత్ ఘాతంతో గేదె మృతి.. మాసాయిపేట్‌లో ఘటన

కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలం మాసాయిపేట్ గ్రామంలో విద్యుత్ ఘాతంతో గేదె మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన యువరైతు మామిడిపల్లి రవీందర్‌కు చెందిన గేదెలు ఉదయం మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో గ్రామ రోడ్డుకు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైరు తగిలి ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందింది.

గేదెల కాపరి ఈ విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం విద్యుత్ శాఖ, వెటర్నరీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని గేదె మృతి చెందినట్లు నిర్ధారించారు.

అప్పులు చేసి కొత్తగా గేదెల పెంపకం ప్రారంభించిన యువరైతు రవీందర్ గేదె మృతి చెందడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని తెలిపారు. తమకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులను కోరారు.