భగవద్గీత చదివితే సర్వం తెలుస్తుంది..

భగవద్గీత చదివితే సర్వం తెలుస్తుంది..
ఈనెల 23న భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు…
తి.తి.దే.ధర్మకర్తల మండలి సభ్యులు…
నంద్యాల బ్యూరో, నవంబర్ 3 ఆంధ్రప్రభ : గీతా జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న భగవద్గీత కంఠస్థ పఠణ పోటీలలో భాగంగా ఈ సంవత్సరం నంద్యాల జిల్లాకు గాను ఈనెల 23వ తేదీన డోన్ పట్టణంలోని శ్రీసుధా విద్యాసంస్థల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ గౌడ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం నందు ఆవిష్కరించారు.
విద్యార్థులకు బాల్యం నుండే భగవద్గీత నేర్పడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెరగడంతో పాటు, మనోధైర్యం కూడా పెరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ “ప్రతి ఇంటా భగవద్గీత – ప్రతి నోటా భగవద్గీత” అని సంకల్పించుకోవాలన్నారు. ఈ సంవత్సరం పోటీల విధివిధానాలు మూడు విభాగాలుగా నిర్వహించనున్నారని, 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం మొత్తం 27 శ్లోకాలు, 10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగయోగం మొత్తం 24 శ్లోకాలు,18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వారికి “నిత్యజీవితంలో భగవద్గీత – భావ విశ్లేషణ” అనే అంశంపై ఈ పోటీలు నంద్యాల జిల్లాకు, కర్నూలు జిల్లాకు విడివిడిగా పోటీలు నిర్వహించబడునని, త్వరలో కర్నూలు జిల్లాలో నిర్వహించనున్న పోటీల తేదీని ప్రకటించనున్నామని తెలిపారు.
ప్రతి విభాగం నుండి విజేతలను గుర్తించి వారికి ప్రథమ బహుమతి 1,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 816 రూపాయలు, తృతీయ బహుమతి 516 రూపాయలు అందించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, కళ్యాణ మండపం మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, ప్రసాద్, విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, లలితకళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, మద్దికుంట రాంభూపాల్ రెడ్డి, ఆవోపా నాగేశ్వరరావు, గోదాగోకులం బృందం, తరిగొండ వెంగమాంబ సేవాసమితి పి.నీలిమ, యోగామాష్టర్ బి. జయలక్ష్మి, శ్రీరామపట్టాభిషేక మహోత్సవ సమితి ప్రతినిధులతో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
