నరసరావుపేటలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

పల్నాడు అభివృద్ధి పథంలో పరుగులు
స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు


నరసరావుపేట, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ) : 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు .ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆహారం ,పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ , జాయింట్ కలెక్టర్ సంజన సింహ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలీస్ పరోడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగరవేశారు, జెండా వందనం చేశారు.

పలు రకాల సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు, ఉత్తమ ఉద్యోగస్తులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. శకటాల ప్రదర్శన చేశారు. పోలీస్ డాగ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో నరసరావుపేట ఎమ్మెల్యే మాట్లాడారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో సాధించిన ప్రగతిని జిల్లా యంత్రాంగం వివరించింది. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు . పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, ఆధునిక వ్యవసాయం, రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్, కృత్రిమ మేధ వినియోగం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది.

పేదరిక నిర్మూలనకు పీ4 కార్యక్రమం…
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రత్యేక ప్రగతి సాధించింది. జిల్లాలో 1,21,796 బంగారు కుటుంబాలను గుర్తించగా, 35,896 కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు. మొత్తం 2,862 మంది మార్గదర్శకులను గుర్తించి వారి సహకారంతో దత్తత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు వెల్లడించింది.

పెట్టుబడులు.. ఉపాధికి ఊతం…
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 6,28,347 ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. పల్నాడు జిల్లాలో రూ.3,431 కోట్ల పెట్టుబడులతో 44 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పడి 16,064 మందికి ఉపాధి లభించిందని పేర్కొంది. మరో రూ.5,988 కోట్ల పెట్టుబడులతో 8 భారీ పరిశ్రమలు ఏర్పడి 9,923 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపింది.

జిల్లాలోని నియోజకవర్గాల్లో స్కిల్‌ హబ్‌ల ద్వారా ఒక్కో కేంద్రంలో 550 మందికి శిక్షణ అందించినట్లు, 15 డిగ్రీ కళాశాలల్లో 4,895 మంది విద్యార్థులకు ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌ శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. వివిధ సంస్థలు నిర్వహించిన జాబ్‌ మేళాల ద్వారా 4,226 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం…
ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్‌ఎస్‌ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో 52,872 ఫిర్యాదులు స్వీకరించగా, 43,648 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట…
రైతుల నుంచి ధాన్యం సేకరణలో పురోగతి సాధించినట్లు అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 73 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు. దాచేపల్లి యార్డులో ఈ-నామ్‌ ద్వారా 5,430 మంది రైతులు రూ.42.36 కోట్ల విలువైన మిరపను విక్రయించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

దీపం-2 పథకం కింద జిల్లాలో 4,09,498 మంది లబ్ధిదారులకు 20,28,127 గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసి, రూ.162 కోట్ల సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2026-27లో అనుమతించిన వ్యవసాయ పనిముట్ల కోసం రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ‘అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌’ పథకం కింద 2,40,530 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.159 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నీటి భద్రతకు ప్రత్యేక చర్యలు…
పల్నాడు జిల్లాలో జలధార్‌, జలహారతి వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు చేపట్టడంతో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం 0.87 మీటర్లు పెరిగిందని అధికారులు తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.240.35 కోట్లతో 604 పనులు మంజూరు కాగా, 368 పనులు పూర్తయ్యాయని, 230 పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు.

వైద్య రంగంలో మౌలిక వసతుల పెంపు…

ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో 50 పీహెచ్‌సీలు, 26 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 361 విలేజ్‌ క్లినిక్‌ సెంటర్ల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 47.53 ఎకరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు సర్వజన ఆసుపత్రి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, ఇందుకోసం ఇప్పటివరకు రూ.303.14 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

విద్యకు అధిక ప్రాధాన్యం…
జిల్లాలో 1,41,778 మంది విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర’ కిట్లు అందించినట్లు తెలిపారు. ‘తల్లికి వందనం’ పథకం కింద 2,65,686 మంది విద్యార్థులకు రూ.398 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్ర సగటు 85.25 శాతం కాగా, పల్నాడు జిల్లా ఎస్‌ఎస్‌సీ ఫలితాలు 87.52 శాతంగా నమోదయ్యాయని వెల్లడించారు.

శాంతిభద్రతలు.. మహిళల రక్షణకు చర్యలు…
మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈగిల్‌ ఆధ్వర్యంలో 84 కార్యక్రమాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం జిల్లాలో ఐదు శక్తి బృందాలు ఏర్పాటు చేసి, మహిళలు–బాలికలపై వేధింపులు, సైబర్‌ నేరాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శక్తి యాప్‌లో 27,444 మంది నమోదు కాగా, రాష్ట్రంలో పల్నాడు జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు.

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం…
‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా జిల్లాలోని 362 బస్సుల్లో సగటున రోజుకు 1.20 లక్షల మంది మహిళలు, 3,300 మంది దివ్యాంగులు ఉచిత రవాణా సౌకర్యాన్ని పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

హరిత పల్నాడు దిశగా అడుగులు…
పల్నాడులో పచ్చదనం పెంపునకు 433 హెక్టార్లలో ప్లాంటేషన్‌ చేపట్టడంతో పాటు సుమారు 30 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కల నిర్వహణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జంతువులకు తాగునీరు, భూగర్భ జలాల పెంపు కోసం 73 నీటి కుంటలు, ఒక చెక్‌డ్యామ్‌ నిర్మించినట్లు పేర్కొన్నారు.

రోడ్లు, వంతెనల అభివృద్ధి…
పల్నాడు జిల్లాలో రహదారులు, వంతెనల అభివృద్ధికి పలు పథకాల కింద పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆసియా బ్యాంకు నిధులతో రూ.70.75 కోట్లతో 30 రోడ్డు పనులు మంజూరు కాగా, 23 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రాజుపాలెం–అమరావతి రహదారి విస్తరణ, పటిష్టీకరణకు రూ.148.90 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని మాడిపాడు వద్ద కృష్ణా నదిపై రూ.60.54 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు.

స్వచ్ఛ పల్నాడు లక్ష్యంగా చర్యలు…
జిల్లాలో పరిశుభ్ర గ్రామాల లక్ష్యంతో 28 స్వచ్ఛ రథాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఇళ్ల నుంచి సేకరించిన 7,31,829 కిలోల పొడి చెత్తకు బదులుగా రూ.2.02 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను ‘ఓడీఎఫ్‌ ప్లస్‌’గా ప్రకటించినట్లు తెలిపారు.

స్వర్ణ పల్నాడు సాధనకు సమష్టి కృషి…
అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో పల్నాడు జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.