ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఏలూరు (ఆంధ్రప్రభ): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు రేంజ్ కార్యాలయం, ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ రేంజ్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశాన్ని మనమే పరిపాలించుకునే స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదే స్ఫూర్తితో ఏలూరు రేంజ్ పోలీసు యంత్రాంగం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు.

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని తెలిపారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు నడిపించేందుకు మహనీయుల పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రజల రక్షణలో పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ వై. ప్రసాద్ రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, అదనపు ఎస్పీ చంద్రశేఖర్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఆర్‌ఐలు పవన్ కుమార్, సతీష్, ఆర్‌ఎస్‌ఐ భాస్కర్ రావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.