రక్తదానానికి ముందుకు రావాలి..

విజయవాడ (ఆంధ్రప్రభ): స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ లబ్బిపేట పెద్ద మసీదు వద్ద ఛాంపియన్షిప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన దాతలకు ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఛాంపియన్షిప్ ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో దాతలు అందించే రక్తం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎం.డి. నాహీద్, ఛాంపియన్షిప్ ఫౌండేషన్ ప్రతినిధులు షేక్ బషీర్, సిరాజుద్దీన్, డైరెక్టర్లు అలీ, అన్సారీ, అంబాసిడర్లు రహమతుల్లా, బాజానీ తదితరులు పాల్గొన్నారు.