అమరుల త్యాగఫలమే స్వాతంత్య్రం
- స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేయాలి
- ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: సర్పంచ్ గడిపర్తి
వేంసూరు, ఆంధ్రప్రభ : అమరుల త్యాగఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని జయలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. వారి వీరోచిత పోరాటాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు. అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
