lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
మూసివేత దారిలో యజమానులు
ఖర్చు భరించలేక తగ్గించుకుంటున్న మెనూ
కొన్ని హోటళ్లలో అదనపు బాదుడు
కొందరు కట్టెల పొయ్యి మీద వంట
కట్టెలకు కూడా పెరిగిన డిమాండ్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన దిగుమతుల అంతరాయం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల తీవ్ర కొరత ఏర్పడి హోటల్ రంగం కుదేలవుతోంది. హైదరాబాద్‌లో వేలాది హోటళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు మూతపడే పరిస్థితికి చేరాయి. ఈ సంక్షోభం వల్ల కొన్ని హోటళ్లు మెనూ తగ్గించడమే కాకుండా, బిల్లులపై ప్రత్యేక చార్జులు వసూలు చేస్తున్నాయి. కొందరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని హోటల్స్‌ను నడిపిస్తున్నారు. ఖర్చు పెరగడంతో యజమానులు ధరలు కూడా పెంచుతున్నారు.

దేశ వ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. గ్యాస్ కొరత వల్ల కొందరు వాటిని మూసివేశారు. ఖర్చులు భరించలేక కొందరు హోటళ్లలో మెనూలను తగ్గించుకుంటున్నారు. మరికొందరు కట్టెలను వినియోగించి వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కట్టెలతో వంట చేయడం సమయం ఎక్కువ తీసుకుంటోంది. గ్యాస్‌తో 30-35 నిమిషాల్లో అయ్యే వంట, ఇప్పుడు గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో కస్టమర్లు వెయిట్ చేయలేక వెళ్లిపోతున్నారు. ఇలా వ్యాపారంపై ప్రభావం పడుతుందని హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కట్టెలకు కూడా డిమాండ్ పెరగడంతో వాటి ధర కూడా అమ్మకందారులు పెంచేశారు. ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెంచి అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్‌ను రూ. 4,000 నుంచి 7,000లకు విక్రయిస్తున్నారు. గ్యాస్ సరఫరా త్వరగా సాధారణ స్థితికి రాకపోతే చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూసివేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


