జైనూర్ పంచాయతీలో వారపు సంతల వేలంపాట
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే పశువుల సంత, తై బజార్ వారపు సంతలకు సంబంధించి మంగళవారం జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఆవరణలో వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షత వహించారు.
వేలంపాటలో పాల్గొన్న దారులు పోటాపోటీగా బిడ్లు వేయగా, పశువుల సంతను కొడప సోనే రావు రూ. 18 లక్షల 30 వేలుకు దక్కించుకున్నారని సర్పంచ్ కొడప ప్రకాష్, పంచాయతీ ఈవో ఆనందరావు తెలిపారు.
అయితే తై బజార్ వేలంపాటకు సరైన ప్రభుత్వ రుసుము రాకపోవడంతో ఆ వేలాన్ని వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 25వ తేదీ బుధవారం వేలంపాట నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ వేలంపాట 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వారపు సంతల కాంట్రాక్ట్‌గా నిర్వహించబడుతోందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మండల పంచాయతీ అధికారి భూఖ్య శశికుమార్, ఉప సర్పంచ్ డోంగ్రే ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్, వార్డు సభ్యులు, వేలం దారులు పాల్గొన్నారు.
