తెలంగాణ ఫార్ములాతో కాంగ్రెస్ ఘన విజయం

తెలంగాణ ఫార్ములాతో కాంగ్రెస్ ఘన విజయం

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అధికార ఎల్డీఎఫ్‌ను గద్దె దించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలు, తెలంగాణ ఫార్ములా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను గద్దె దించిన జోష్‌తో కేరళలోనూ అదే తరహా దూకుడును ప్రదర్శించారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ చేసిన విమర్శలు అక్కడి ఓటర్లను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా విజయన్ పాలనను, బీజేపీకి ఆయన పరోక్ష సహకారం అందిస్తున్నారని రేవంత్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. యువతను ఆకర్షించడంలో ఆయన శైలి, అక్కడి కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన కీలక సూత్రాలను రేవంత్ కేరళలోనూ ప్రయోగించారు. తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా వంటి పథకాలను ఉదాహరణగా చూపుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేరళలోనూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజల్లో నమ్మకం కలిగించారు.

ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆయుధంగా మలుచుకుని, కాంగ్రెస్ సంక్షేమ నమూనాను ప్రజల ముందుకు తీసుకెళ్లారు. తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించిన గ్రౌండ్ లెవల్ మేనేజ్‌మెంట్‌ను కేరళలోని స్థానిక నాయకత్వంతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారని సమాచారం. కేరళ సీఎం పినరయి విజయన్ తన సొంత నియోజకవర్గం ధర్మడంలో కూడా గెలవడానికి ఆపసోపాలు పడాల్సి వచ్చింది. అంతేకాకుండా, దాదాపు 12 మందికి పైగా మంత్రులు వెనుకబడ్డారు. దీనిని బట్టి ప్రజలు మార్పును బలంగా కోరుకున్నారో అర్థమవుతోంది.

కర్ణాటక, తెలంగాణ తర్వాత ఇప్పుడు కేరళలోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగుతుండటం, ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అని నిపుణులు పేర్కొంటున్నారు.


కాంగ్రెస్ ముక్త భారత్ అసాధ్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు బీజేపీ కలలు కంటున్న ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అసాధ్యం అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీజేపీ విభజన రాజకీయాలు, మతతత్వం పేరుతో ప్రజలను విభజించడమే శాశ్వతమని భావిస్తోందని విమర్శించారు. కానీ ప్రజాస్వామ్యం తప్పకుండా గెలుస్తుందని, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు.

కేసీ వేణుగోపాల్ నాయకత్వంలో సతీశన్ తదితర నేతలకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికార కోసం అడ్డదారులు తొక్కలేదని, ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటుందని అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదని తేల్చిచెప్పారు.

Leave a Reply