అధికార మత్తులో రేవంత్ రెడ్డి

అధికార మత్తులో రేవంత్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవడు..
  • నియంత పాలనకు అంతం తప్పదు..
  • కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు రావు..
  • రైతును గొస పెడుతున్న ప్రభుత్వం
  • 20వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టారు..
  • కేసీఆరే రావాలంటున్న ప్రజలు
  • బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారు..
  • మాజీ మంత్రి తన్నీరు హరీశ్రవు

జమ్మికుంట, ఆంధ్రప్రభ : అధికార మత్తులో రేవంత్ రెడ్డి అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిపించరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, సర్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్రావు, జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, సభ్యత్వ నమోదు ఇన్చార్జి చిరుమిల్ల రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ లు హాజరై పార్టీ శ్రేణులు దిశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అధికార మత్తు ఎక్కిందని, రేవంత్ నియంత పాలన అంతం చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని, రేవంత్ సైతం ఎమ్మెల్యేగా ఓటమి చెందడం ఖాయమన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలంతా మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ వంచిందన్నారు. రైతులకు సైతం ఆశ చూపి రైతు బీమా, రైతుబంధును ఎగరవేశారని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో కరోనా వచ్చినా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎప్పుడూ రైతుబంధు ఆగలేదని, సకాలంలో చెల్లించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సుమారు రూ. 20వేల కోట్ల రైతుబంధును ఎగవె సిందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రైతులకు సాగు సరిపడా యూరియా, ఎరువులు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ నిలిపిన ఘనత కేసీఆర్ నని, కానీ కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రాన్ని తిరోగమనం దిశగా నడిపించిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంటలను అమ్ముకునేందుకు సైతం రైతులు అరిగోస పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 11 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో రైతులకు కరెంటు విషయంలో మరింత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్నారు.

Leave a Reply