Lenin Movie | తొలి రోజే రూ.16.7 కోట్లకు పైగా వసూళ్లు
పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న అఖిల్ సినిమా..
ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నిర్మాతలు
Lenin Movie | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హైదరాబాద్, జులై 11: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన ఆరంభం చేసింది. విడుదలైన తొలి రోజే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు భారీ వసూళ్లను నమోదు చేసి అఖిల్ కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది.
సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జులై 10న విడుదలైన ‘లెనిన్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రానికి బలమైన ఓపెనింగ్ లభించింది. మొదటి ఆట నుంచే థియేటర్లలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లకు ఊపు వచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా విజయోత్సాహాన్ని పంచుకుంటూ చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. “అఖిల్ 2.0 వచ్చేశాడు.. అతని గర్జనను బాక్సాఫీస్ గట్టిగా వినిపించుకుంది!” అంటూ మేకర్స్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు ఘన ఆదరణ అందించిన తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మంచి మౌత్ పబ్లిసిటీ, ప్రేక్షకుల సానుకూల స్పందనతో వారాంతంలో ‘లెనిన్’ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
