వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ విజయవంతం
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి ఈర్ల రామచందర్, పీడీఎస్యూ జార్జి రెడ్డి జిల్లా అధ్యక్షుడు రత్న నరేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని వెంటనే నియమించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి అక్షయపాత్ర, ఇస్కాన్, మన్న వంటి సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి, జీఓ నంబర్లు 7, 8, 9లను రద్దు చేయాలని కోరారు. అలాగే ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి, పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్లు, ఆధునిక వసతులు, ఉచిత రవాణా సౌకర్యం, బడి బస్సులు, ఉచిత బస్సు పాస్లు కల్పించాలని, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసి, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన విద్యా భరోసా కార్డులు, ఉచిత ల్యాప్టాప్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, నూతన జాతీయ విద్యా విధానం-2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
వామపక్ష విద్యార్థి సంఘాల బంద్కు సహకరించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్నకొండ సాయి ఆజాద్, మహంకాళి శ్రీవర్ధన్, ఆదిత్య, సాయి, అభిషేక్, గణేష్, అమరేందర్, రాహుల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
