ఘనంగా చండీయాగం..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలో ఆదివారం శ్రీ రుద్రయాగం–చండీయాగం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ మహాయాగానికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లోక కళ్యాణార్థం నిర్వహించిన చతుసృష్టి కుండాత్మక శ్రీ రుద్రయాగంతో పాటు చండీయాగం విశేషంగా జరిగింది. ఈ యాగంలో 108 దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రాంతంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.
ఝాన్సీ రాజేందర్ రెడ్డి యాగశాలలో పూజల్లో పాల్గొని, వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాగంలో పాల్గొన్న దంపతులను ఆశీర్వదిస్తూ వారి కుటుంబాలకు శాంతి, సౌఖ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సత్సంకల్పాలను పెంపొందించడంతో పాటు ప్రజల్లో ఐక్యతను బలపరుస్తాయని తెలిపారు. చండీయాగం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, వార్డు కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
