రైల్వే భద్రతకు భారీ కసరత్తు

రైల్వే భద్రతకు భారీ కసరత్తు
19 స్టేషన్లలో మెగా సేఫ్టీ–హెల్త్ అవేర్‌నెస్ క్యాంపెయిన్
7 వేల మంది రైల్వే సిబ్బందికి అత్యవసర పరిస్థితులపై ప్రత్యేక శిక్షణ
అగ్నిప్రమాదాలు, వడదెబ్బలు, రద్దీ నియంత్రణపై ప్రత్యక్ష శిక్షణ..
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సివిల్ డిఫెన్స్ సంస్థ వినూత్న కార్యక్రమం..
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ:
ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణలో సిబ్బంది సామర్థ్యాలను మరింత పెంచే దిశగా దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సివిల్ డిఫెన్స్ సంస్థ విస్తృత స్థాయిలో మెగా సేఫ్టీ అండ్ హెల్త్ అవేర్‌నెస్ క్యాంపెయిన్ నిర్వహించింది. మే 7 నుంచి 21 వరకు రెండు వారాలపాటు కొనసాగిన ఈ కార్యక్రమం విజయవాడ డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వే స్టేషన్లలో నిర్వహించారు. వేసవి తీవ్రత, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేలా ఫ్రంట్‌లైన్ సిబ్బందిని సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా రైల్వే అధికారులు వెల్లడించారు. డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనకియా మార్గదర్శకత్వంలో, ఏడీఆర్‌ఎంలు పి.ఈ. ఎడ్విన్, శ్రీనివాస్‌రావు కొండ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
క్యాంపెయిన్‌లో భాగంగా అగ్నిప్రమాదాల నివారణ, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగం, అగ్ని ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఎండల తీవ్రత నేపథ్యంలో వడదెబ్బ నివారణ, చికిత్స పద్ధతులపై సిబ్బంది, ప్రయాణికులకు అవగాహన కల్పించారు. స్టేషన్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, గుండెపోటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే సిపిర్ విధానం, గొంతులో ఆహారం ఇరుక్కున్నప్పుడు చేపట్టాల్సిన “చోక్ రిలీఫ్” టెక్నిక్స్, ప్రాథమిక ఆరోగ్య అవగాహన అంశాలపై ప్రదర్శనలు నిర్వహించారు.
వేసవి ప్రత్యేక రైళ్ల రద్దీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక సేఫ్టీ డ్రిల్స్ నిర్వహించగా, ఈ కార్యక్రమంలో 7 వేల మందికి పైగా రైల్వే సిబ్బంది పాల్గొని శిక్షణ పొందారు.
దీంతో అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన సభలో సివిల్ డిఫెన్స్ డివిజనల్ కంట్రోలర్, ఏడీఆర్‌ఎం (ఇన్‌ఫ్రా) పి. ఎడ్విన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డివిజనల్ ఎమర్జెన్సీ ఆఫీసర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ పి.వి. రామిరెడ్డి, సివిల్ డిఫెన్స్ స్టాఫ్ ఆఫీసర్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఎం. దినేష్ కుమార్, సీనియర్ సివిల్ డిఫెన్స్ ఇన్‌స్ట్రక్టర్ టి. సుధీర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, రైల్వే భద్రతలో నిరంతర శిక్షణ, అప్రమత్తత కీలకమని పేర్కొన్నారు. ప్రయాణికుల ప్రాణ రక్షణలో సివిల్ డిఫెన్స్ బృందాల సేవలు కీలకమని కొనియాడారు. గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు, వంటగది అగ్నిప్రమాదాలు, వడదెబ్బ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన ప్రత్యక్ష విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రయాణికుల భద్రత, సిబ్బంది సిద్ధత, విపత్తుల నిర్వహణలో ముందస్తు చర్యలకు విజయవాడ డివిజన్ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసిందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
