పోలీస్‌ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ ఏర్పాటు చేయాలి

నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం మున్సిపాలిటీ చొరవ తీసుకోవాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు ప్రజా జాగృతి సమితి విజ్ఞప్తి

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: పోలీసు శాఖలో ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో పట్టణంలోని నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రజా జాగృతి సమితి డిమాండ్‌ చేసింది. సమితి అధ్యక్షుడు రాజలింగు మోతె ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజలింగు మోతె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో అధిక ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హత, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పలువురు యువత పోలీసు ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మున్సిపాలిటీ సామాజిక బాధ్యతగా భావించి వెంటనే ఉచిత కోచింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాత పరీక్షకు శిక్షణతో పాటు ఫిజికల్‌ ట్రైనింగ్‌, స్టడీ మెటీరియల్‌, వారానికోసారి మాక్‌ టెస్టులను కూడా ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే కోచింగ్‌ ప్రారంభిస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమితి నాయకులు వేల్పుల వెంకటస్వామి, రామిళ్ల మల్లేష్‌, ఎట్టం లచ్చయ్య పాల్గొన్నారు.