విశాఖ యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్
బావమరిది వ్యవహారంలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు
మరో 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. విశాఖపట్నానికి చెందిన ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించారని, మానసికంగా వేధించారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఫిర్యాదు ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఆరోపించింది. అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడని తెలిపింది.
ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా తనను బెదిరించారని, బలవంతంగా వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.
యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బెదిరింపులు, సైబర్ వేధింపులు తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, తదుపరి పరిణామాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
