అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి..!
యాలాల మండలంలో ఘటన..
కల్తీ కల్లు కారణమని స్థానికుల ప్రచారం
యాలాల, ఆంధ్రప్రభ: వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బల ఆనవాళ్లు లేకపోవడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ కల్లు సేవించడం వల్లే మృతి చెందినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయితే మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదికతోనే వెల్లడికానుంది.
యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కోకట్ పరిధిలోని సుమిత్‌కు చెందిన రాయి పాలిష్ యూనిట్ గదిలో వరుసకు మామ, అల్లుడైన అబ్దుల్ లయాఖత్ (45), గోరెప్ప (32) నివాసముంటున్నారు. సోమవారం రాత్రి భోజనం అనంతరం మద్యం సేవించి నిద్రించిన వీరు మంగళవారం ఉదయానికి మృతి చెంది కనిపించారు.
మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు, దెబ్బల గుర్తులు లేవని పోలీసులు తెలిపారు. మృతికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ విఠల్‌రెడ్డి తెలిపారు. మరోవైపు తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
