ఆగస్టు 31 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా

ఉట్నూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త పింఛన్ల కోసం ఈ నెల 11 నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఉట్నూర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేయూత పథకం కింద నూతన దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నవీకరణ ప్రక్రియను ఐటీడీఏ పీఓ మంద మకరందుతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారుల వద్ద దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అర్హులు దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, ఫొటో, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌ జత చేయాలని తెలిపారు. వితంతు పింఛన్‌ కోసం గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలన్నారు. చేనేత, గీత కార్మికుల దరఖాస్తులను సంబంధిత శాఖల సమన్వయంతో పరిశీలిస్తామని చెప్పారు.

ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అర్హులకు పింఛన్‌ మంజూరు పత్రాలు అందజేస్తామని కలెక్టర్‌ వివరించారు. దరఖాస్తు చేసుకునేందుకు సుమారు మూడు వారాల సమయం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

గిరిజన ప్రాంతాల్లో పెసా మొబిలైజర్లు, సమన్వయకర్తల ద్వారా ఆదివాసీలు, ఇతర అర్హులకు దరఖాస్తు ప్రక్రియలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్‌ ఎంపీడీవో రైసుల్లా, ఎంపీఓ సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.