పెర్కపల్లెలో భూవివాదం.. ఉద్రిక్తత

పంట ధ్వంసం చేశారని రైతు ఆరోపణ..

సర్వే చేసి న్యాయం చేయాలని డిమాండ్

దస్తురాబాద్, ఆంధ్రప్రభ: నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం పెర్కపల్లె గ్రామంలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలోకి ఓ వర్గం వారు వచ్చి దౌర్జన్యానికి పాల్పడి, పంటను ధ్వంసం చేయడంతో పాటు పశువుల మందను పొలంలోకి తోలారని బాధిత రైతు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

గ్రామానికి చెందిన గోపు లచ్చవ్వకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో ఆమె కుటుంబం 50 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే తాజాగా గ్రామానికి చెందిన ఓ వర్గం వారు ఆ భూమి గతంలో పార్వతి లచ్చగౌడ్‌కు చెందినదంటూ వివాదానికి దిగారని లచ్చవ్వ పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా తన పొలంలో వేసిన వరి నాటును పూర్తిగా ధ్వంసం చేశారని, అనంతరం కాలనీకి చెందిన పశువుల మందను ఉద్దేశపూర్వకంగా పొలంలోకి తోలడంతో పంటకు మరింత నష్టం వాటిల్లిందని ఆమె ఆరోపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భూమికి సంబంధించిన హక్కులను నిర్ధారించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధితులు, గ్రామస్తులు కోరుతున్నారు.