జాతీయస్థాయి పోటీలకు హ్యాపీ వ్యాలీ విద్యార్థులు..
విజయవాడ, ఆంధ్రప్రభ: ఎలూరులో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన సీబీఎస్ఈ క్లస్టర్–VII టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన హ్యాపీ వ్యాలీ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో హ్యాపీ వ్యాలీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
ఎలూరులోని సీ.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో అండర్–17 బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. జట్టులోని కె.చారిత్, ఆర్నవ్, ఆర్.రోహిత్, ఎస్.లక్ష్మణ్ అత్యుత్తమ ఆటతీరుతో గుజరాత్లో జరిగే సీబీఎస్ఈ జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించారు.
అదేవిధంగా అండర్–19 బాలుర విభాగంలో డి.రుత్విక్, కె.ఉజ్వల్, బి.తనయ్, బి.జయంత్‌లతో కూడిన హ్యాపీ వ్యాలీ స్కూల్ జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. సింగిల్స్ విభాగంలో కె.ఉజ్వల్ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
క్లస్టర్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు తదుపరి సీబీఎస్ఈ జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. హ్యాపీ వ్యాలీ విద్యార్థులు సాధించిన విజయంపై పాఠశాల చైర్మన్ కె. కోటేశ్వరరావు, డైరెక్టర్ కె. అవినాష్, డీన్ కె. రఘురాం, ప్రిన్సిపల్ జీ.టి.ఎస్. మంజునాథ్, కోచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, కోచ్‌లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులను పాఠశాల యాజమాన్యం అభినందించి, జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది.
