పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..
పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..
- చౌటుప్పల్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గంజాయి, డ్రగ్స్ మాఫియాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లో ఆయన ‘ఆంధ్రప్రభ’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల అదుపునకు తీసుకుంటున్న పలు కీలక చర్యలను వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలో అన్ని రకాల నేరాలను, రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్, రూరల్ సీఐ రాములు ఉన్నారు.
వలస కార్మికులపై నిఘా.. ఇప్పటికే 35 కేసులు:
చౌటుప్పల్ పరిసర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పట్ల పరిశ్రమల యాజమాన్యాలు, వారిని తీసుకువచ్చిన లేబర్ కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఆదేశించారు. వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అమ్మకాలలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మైగ్రేషన్ లేబర్ భాగస్వాములు అవుతున్నారని, ఇప్పటికే వారిపై డివిజన్ పరిధిలో 35 కేసులను నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
అనుమానం వచ్చిన వలస కార్మికుల వివరాలను తక్షణమే పోలీసులకు తెలియజేయాలన్నారు. అలాగే, గంజాయి, డ్రగ్స్ మూటాలను, ఇతర నేరస్తులను పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. గత మే 16వ తేదీన పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 2.19 కోట్ల విలువైన 437.5 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ గుర్తుచేశారు.
అతివేగం.. అకాల మరణం:
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలను అతివేగంగా నడపకుండా నిబంధనల ప్రకారం పరిమిత వేగంతో నడపాలని సూచించారు. వాహనదారులు వేగాన్ని నియంత్రించుకోకుండా నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనాలను నడిపితే తాము ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, ఎదురుగా వచ్చే ఇతర వాహనదారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టి, వారికి తీవ్ర ఇబ్బంది కలిగించిన వారవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాగ్రత్త:
చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నందున తంగడపల్లి క్రాస్ రోడ్డు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు రోడ్డు క్రాస్ చేసే సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకంగా రాత్రి సమయంలో వాహనాలు వేగంగా వస్తున్నందున వాహనాదారులు రెండువైపులా చూసుకొని నెమ్మదిగా వెళ్లాలన్నారు. అదేవిధంగా, వ్యాపారులు ఆవులు, ఎడ్లను, లేగ దూడలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేరగాళ్లకు సింహస్వప్నం.. యువత చెడు మార్గాల్లోకి వెళ్లొద్దు:
చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్య ప్రజలకు, బాధితులకు తక్షణ న్యాయం జరిగేలా సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అదే సమయంలో రౌడీలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్తుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లోకి తీసుకోరాదన్నారు. నేటి యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులు కాకుండా, ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలన్నారు.
గంజాయి, డ్రగ్స్, మద్యానికి బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ప్రతి చిన్న విషయానికి కోర్టుల వరకు వెళ్లి తమ అమూల్యమైన సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని, గ్రామాలలో కక్షలను పెంచుకోకుండా రాజీ మార్గంలో పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమన్నారు. కేసుల పరిష్కారం కోసం కోర్టులు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లను కక్షీదారులు ఉపయోగించుకోవాలన్నారు.
ప్రతి పౌరుడూ పోలీసులా మారాలి:
సమాజంలో నేరాలను అరికట్టడంలో పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని డీఎస్పీ మధుసూదన్ రెడ్డి కోరారు. నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడు ఒక పోలీసులా బాధ్యతగా వ్యవహరించినప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సమాజంలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
