అమ్మ సేవలో ‘ కింజారపు ‘ మంత్రులు
అమ్మ సేవలో ‘ కింజారపు ‘ మంత్రులు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 23(ఆంధ్రప్రభ): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) తో కలసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రసిద్ధికెక్కిన ఈ యాత్ర.. వందేళ్లు పూర్తి చేసుకోవడంతో శతాబ్ది ఉత్సవాల పేరుతో ఈ ఏడు ప్రభుత్వం మరింత ఘనంగా నిర్వహిస్తోంది.
తొలుత ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అక్కడి ఆలయం లోపలికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు (RamMohanNaidu), అచ్చెన్నాయుడు లు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఫల పుష్పాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆశీర్వాదం అందించారు. స్థానిక మహిళల కోలాట నృత్యాన్ని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కూడలిలో ఉన్న దివంగత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
గ్రామంలోని గ్రామ దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. బాబాయ్, అబ్బాయ్ లు వీధుల్లో తిరుగుతూ.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ.. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ఉత్సవ ఉత్సాహాన్ని ప్రజల్లో రెట్టింపు చేశారు. శతాబ్ది ఉత్సవాల్లో (Centenary celebrations) ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్, సెంట్రల్ లైటింగ్ లను కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. తమ పల్లె ప్రాంతానికి హెలికాప్టర్ రైడ్ (Helicopter ride) తీసుకువచ్చి.. ఉత్సవాల్లో కొత్త శోభను తీసుకువచ్చినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, కింజరాపు హరి వరప్రసాద్, కింజారపు ప్రభాకర రావు, కొత్తమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
