జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం
జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో విద్యా రంగానికి కొత్త ఊపిరినిస్తూ రెండు కేంద్రీయ విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. చిత్తూరు, కుప్పం మండలాల్లో ఏర్పాటు చేసిన ఈ విద్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం పట్టణంలోని ఇరువారం సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, చూడ చైర్‌పర్సన్ కటారి హేమలత, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం గర్వకారణమని తెలిపారు. చిత్తూరు, కుప్పం మండలాల్లో ఒక్కో విద్యాలయంలో 320 సీట్లతో విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. తాత్కాలిక భవనాల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికే సుమారు 70 శాతం అడ్మిషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన సీట్లు కూడా త్వరలోనే భర్తీ అవుతాయని, వారం రోజుల్లో పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విద్యాలయాల ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ, జిల్లాలో యువతకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఈ విద్యాసంస్థ ప్రారంభం కావడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థుల కోసం ఆర్వో తాగునీరు, క్రీడా సామగ్రి, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని వసతులు అందిస్తామని తెలిపారు.

చూడ చైర్‌పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ, చిత్తూరులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రజలకు లభించిన అదృష్టమని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్ చొరవతో ఈ విద్యాసంస్థను ప్రజలకు అందించగలిగామని తెలిపారు. ఈ సాధనకు ముఖ్యమంత్రి కృషి కీలకమని పేర్కొంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, ప్రిన్సిపల్ లూథర్, డీఈవో రాజేంద్రప్రసాద్, సర్వ శిక్ష అభియాన్ ప్రతినిధి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, కూటమి నాయకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు అతిథులు బాలవాటిక, 1, 2, 3 తరగతి గదులను పరిశీలించారు.
