Chandrababu | రైతులకు భూ భద్రత…

Chandrababu | రైతులకు భూ భద్రత…

  • రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తాం.
  • కర్నూలు జిల్లా కలుగట్లలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు.

Chandrababu | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రైతుల భూములకు సంపూర్ణ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు మండలం కలుగట్ల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన విస్తృతంగా ప్రసంగించారు. రాజముద్రతో, విశిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన భూ యాజమాన్య పత్రాలను రైతులకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Chandrababu | భూమి రైతుకు విశ్వాసం… ఎవరూ చెరపలేరు..

భూమి రైతుకు నమ్మకం, విశ్వాసం, అమ్మతో సమానమని ముఖ్యమంత్రి అన్నారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములపై ఎవరూ అక్రమంగా హక్కు చెలాయించకుండా భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో భూ రికార్డులను తారుమారు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వివాదాస్పద భూములపై పెత్తనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసి పారదర్శక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం క్యూఆర్ కోడ్ సహా పలు భద్రతా ఫీచర్లతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని వివరించారు. ఎవరైనా భూ రికార్డులను తారుమారు చేస్తే కఠిన శిక్షలు అమలు చేసేలా నిబంధనలు తీసుకొచ్చామని తెలిపారు.

Chandrababu

Chandrababu | రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో పాస్ పుస్తకాల పంపిణీ…

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 279 గ్రామాల్లో సర్వే చేపట్టి 1.16 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 37.40 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయని, ఇంకా 62 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. 9500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి 2027 డిసెంబరు నాటికి ప్రతి అర్హుడికి పాస్ పుస్తకాలు అందించడమే లక్ష్యమని చెప్పారు. వారసత్వ భూముల మ్యూటేషన్‌ను కేవలం రూ.100తో పూర్తి చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 9వ తేదీన ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ, ఎటువంటి లంచాలు లేకుండా పాస్ పుస్తకాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Chandrababu

Chandrababu | రైతు అభివృద్ధికి టెక్నాలజీ, ఆధునిక సాగు…

రైతులకు లాభదాయక సాగు విధానాలను ప్రోత్సహిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిగా ప్రజల ముందుకు వచ్చి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Chandrababu | రాయలసీమను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం…

గతంలో కరవుతో ఇబ్బందులు ఎదుర్కొన్న రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు ఈ ప్రాంతం నుంచి వస్తున్నాయని చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ సహా పలు పథకాల ద్వారా నీటి వనరులను విస్తరించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పశ్చిమ కర్నూలుకు కూడా సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వేదవతి, గురు రాఘవేంద్ర, రాజోలిబండ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పారు. తుంగభద్ర జలాలను కర్నూలు జిల్లాకు మరింతగా వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు విషయంలో పొరుగు రాష్ట్రాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.

Chandrababu | పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం…

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి పుష్కరాల నాటికి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని అందిస్తూ, శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లిస్తున్నామని చెప్పారు. నీరు అందుబాటులో ఉంటే వ్యవసాయం మాత్రమే కాదు పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి కియా మోటార్స్‌కు నీటి సరఫరా కల్పించినట్లు తెలిపారు.

Chandrababu

Chandrababu | గత పాలనపై విమర్శలు…

గత పాలనలో భూ వివాదాలు పెరిగాయని, రైతుల భూములను 22ఏ కింద పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రజల నుంచి వచ్చే అర్జీల్లో 80 శాతం భూ వివాదాలకు సంబంధించినవేనని చెప్పారు. సర్వే రాళ్లపై ఫోటోలు ముద్రించేందుకు భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజల పన్నుల డబ్బులను దుర్వినియోగం చేశారని విమర్శించారు.

Chandrababu | విద్యుత్ చార్జీలపై హామీ…..

ప్రజలకు భారం పడకుండా భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను చెల్లించాల్సి రావడం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొన్నారు.

Chandrababu | తిరుమల వ్యవహారంపై స్పందన….

తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారీ జరిగిందని ఆరోపిస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం సరిదిద్దిందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం నాణ్యత ప్రమాణాలను కట్టుదిట్టం చేశామని చెప్పారు.

Chandrababu | ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం….

ప్రజా సమస్యల పరిష్కారం, రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply