KCR | పాలమూరుకు శాపంగా మారిన సమైక్య పాలన…

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో అధినేత కేసీఆర్ పాలమూరు జిల్లా నీటి హక్కులపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటమే తెలంగాణకు, ముఖ్యంగా పాత మహబూబ్‌నగర్ జిల్లాకు పెను శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన పాలమూరు చరిత్రను, తాము చేసిన‌ పోరాటాలను ఆయన మరోసారి గుర్తు చేశారు.

సమైక్య పాలనలో మహబూబ్‌నగర్ జిల్లాకు దక్కాల్సిన హక్కులను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కాలరాశాయని కేసీఆర్ ధ్వజమెత్తారు. “ఎస్‌ఆర్‌సీ (SRC) యాక్ట్ ప్రకారం ప్రతిపాదించిన ప్రాజెక్టులను కొనసాగించాలి. కానీ, అప్పర్ కృష్ణా, బీమా, తుంగభద్ర ఎడమ కాల్వ వంటి ప్రాజెక్టుల ద్వారా రావాల్సిన 174 టీఎంసీల నీటిని సమైక్య పాలకులు కుట్రపూరితంగా రద్దు చేశారు” అని ఆయన మండిపడ్డారు. గోదావరిపై ఉన్న దేవనూరు, ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరును కోలుకోలేని దెబ్బ తీశారని ఆరోపించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన స్కీం కాదని, అది దశాబ్దాల కిందట ఉన్న ప్రతిపాదన అని కేసీఆర్ స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ సుమోటోగా జూరాలకు 17 టీఎంసీలు కేటాయించినా, అప్పటి పాలకులు దాన్ని పట్టించుకోలేదని తెలిపారు.

టీ.అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు పునాది రాయి వేశారు.. కానీ అది కాల్వలు లేక, పొలాలు పారక ఒక అనాథ బ్యారేజీలా మిగిలిపోయింది. 2001లో గులాబీ జెండా ఎగిరే వరకు జూరాల గేట్ల ద్వారా నీళ్లు వృథాగా పోవడం తప్ప రైతులకు జరిగిన ప్రయోజనం సున్నా అని పేర్కొన్నారు.

దత్తత పేరిట దగా…

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్న అంశంపై కేసీఆర్ స్పందించారు. జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పి ఇష్టమొచ్చినన్ని పునాది రాళ్లు వేశారు. ఆ రాళ్లను ఏడవడం కోసం పట్టుకోవాలా? లేక కృష్ణానదిలో అడ్డంగా వేసి చెక్‌డ్యామ్ కట్టుకోవాలా? అని అప్పట్లో నిలదీశాను అని గుర్తు చేశారు.

కర్ణాటకకు కట్టాల్సిన రూ.13 కోట్ల పరిహారం కట్టకుండా చంద్రబాబు జూరాలను నిర్లక్ష్యం చేశారని, తాను మహబూబ్‌నగర్ సభలో నిలదీశాకే పనులు ముందుకు సాగాయని చెప్పారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలే ఆర్డీఎస్ (RDS) కెనాల్‌ను బాంబులతో పేల్చివేసిన చరిత్రను విస్మరించలేమని అన్నారు.

వలసల జిల్లా నుండి పోరాటాల జిల్లా వరకు

ఒక్క చుక్క నీరు రాక పాలమూరు జిల్లా నుంచి లక్షలాది మంది ముంబైకి పొట్టచేతపట్టుకుని వలస పోయిన దృశ్యాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జోగులాంబ నుంచి గద్వాల వరకు నేను చేసిన తొలి పాదయాత్ర ఈ అన్యాయాన్ని ఎండగట్టడానికే. 80 వేల ఎకరాలకు పారాల్సిన ఆర్డీఎస్ కెనాల్ 10 వేల ఎకరాలకు పడిపోయినా అడిగే నాథుడు లేకపోయాడు. అదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, మన నీళ్లు మనకు తెచ్చుకునే అవకాశం వచ్చిందని, కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీటిని వదులుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply