Harish Rao Fire | ‘మతిలేని మాటలు’ అంటూ విమర్శలు
Harish Rao Fire | ‘మతిలేని మాటలు’ అంటూ విమర్శలు
Harish Rao Fire | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పాలమూరు ప్రాజెక్టు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. సీఎం వ్యాఖ్యలను “మతిలేని మాటలు”గా అభివర్ణిస్తూ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ చేపట్టబోయే పాదయాత్రతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని, అందుకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా పాలమూరు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణ జల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ ఏడాది కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ 75శాతం వినియోగించుకోగా, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితమైందని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు ప్రాంతంలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని హరీశ్‌రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని మరోసారి ఓడించి, పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
