పీఎండీఎస్ విధానంతో సాగుకు ప్రోత్సాహం..

పీఎండీఎస్ విధానంతో సాగుకు ప్రోత్సాహం..
చిన్నటేకూరులో పంటల సాగును పరిశీలించిన కలెక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే గౌరు చరిత
రైతు పొలంలో విత్తనాలు చల్లిన అధికారులు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వర్షాకాలానికి ముందే సాగు పనులను ప్రారంభించి రైతులకు మెరుగైన దిగుబడులు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న పీఎండీఎస్ (ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్) విధానంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నటేకూరు గ్రామంలో పీఎండీఎస్ విధానంలో చేపట్టిన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామంలోని రైతు మోహన్ పొలంలో సాగు పరిస్థితులను పరిశీలించిన వారు… పీఎండీఎస్ విధానం ద్వారా తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా మెరుగైన పంటల సాగు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వర్షాలు ప్రారంభమయ్యే ముందే పొలాల్లో విత్తనాలు చల్లడం ద్వారా తొలి వర్షాలతోనే మొలకలు వేగంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా రైతు పొలంలో కలెక్టర్, ఎమ్మెల్యే స్వయంగా పీఎండీఎస్ విత్తనాలను చల్లి రైతుల్లో అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రసాయన వినియోగం తగ్గించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా రైతులు ముందుకు రావాలని సూచించారు.
