బాలికల సమగ్రాభివృద్ధికి “కిశోరి వికాసం”

బాలికల సమగ్రాభివృద్ధికి “కిశోరి వికాసం”

మే 1 నుంచి జూన్ 9 వరకు నిర్వహణ

కర్నూలు, ఆంధ్రప్రభ: బాలికల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “కిశోరి వికాసం” సమ్మర్ క్యాంపెయిన్ను మే 1 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రగడ విజయ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె తమ శ్రేణులకు పిలుపునిచ్చారు.

శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఆమె, జిల్లాలోని ప్రతి సచివాలయ పరిధిలో ఈ క్యాంపెయిన్‌ను విస్తృతంగా నిర్వహించి కౌమార బాలికల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, బాల్య వివాహాలు, టీనేజీ గర్భధారణ, లైంగిక వేధింపులు వంటి సమస్యలను నివారించడమే లక్ష్యమని తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక వ్యాయామం, ఆర్థిక క్రమశిక్షణ, స్మార్ట్‌ఫోన్ వినియోగం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం, ఆరోగ్యం మరియు చట్టాలపై అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply