భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..

రెవెన్యూ క్లినిక్స్‌తో వందలాది మందికి ఊరట!
భీమవరం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
2025 డిసెంబర్ 29న ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమం 2026 జూన్ 1 వరకు 20 విడతలుగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కాలంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 755 దరఖాస్తులు అందగా, వాటిలో 286 దరఖాస్తులను పరిష్కరించినట్లు చెప్పారు. అర్హతలు, నిబంధనల ప్రకారం 147 దరఖాస్తులను తిరస్కరించగా, ప్రస్తుతం 322 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వివరించారు.
డివిజన్‌ల వారీగా పరిశీలిస్తే, భీమవరం డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో 327 దరఖాస్తులు అందగా, వాటిలో 121 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయి. 60 దరఖాస్తులు తిరస్కరించగా, 146 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి.
నరసాపురం డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో 273 దరఖాస్తులు అందగా, 111 దరఖాస్తులను పరిష్కరించారు. 52 దరఖాస్తులను తిరస్కరించగా, మరో 110 దరఖాస్తులు పరిష్కార దశలో ఉన్నట్లు వెల్లడించారు.
తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో 155 దరఖాస్తులు అందగా, 54 దరఖాస్తులను పరిష్కరించారు. 35 దరఖాస్తులను తిరస్కరించగా, మిగిలిన 66 దరఖాస్తులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
భూ సమస్యలపై అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు త్వరితగతిన పరిష్కారాలు లభిస్తున్నాయని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
