Jaipur | రాజ‌స్థాన్ బానోడా బాలాజీ ఆల‌యంలో ఆచారం

Jaipur | రాజ‌స్థాన్ బానోడా బాలాజీ ఆల‌యంలో ఆచారం

Jaipur | హుండీలో సమర్పించే కానుకలే ప్ర‌సాదం
‘దైవిక పెట్టుబడి’ గా భ‌క్తుల న‌మ్మ‌కం
ఆ ప్ర‌సాదాన్ని వ్యాపారులు త‌మ ఇంటి ల‌క్ష్మీగా భావ‌న‌
ప్ర‌తి గల్లా పెట్టెలోనూ ఆ న‌గ‌దు ప్ర‌సాదం నాణేలు
లాభాల పొందిన తర్వాత‌ మ‌ళ్లీ ఆల‌య హుండీలోకి కొంత విరాళం
ఈ ఆల‌యానికి రోజు రోజుకీ పెరుగుతున్న భ‌క్తుల తాకిడి

Jaipur | జైపూర్,ఆంధ్ర‌ప్ర‌భ : మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ప్రసాదం అంటే సాధారణంగా తినే పదార్థాలే గుర్తొస్తాయి, కానీ రాజస్థాన్‌లోని బానోడా బాలాజీ ఆలయంలో నగదునే ప్రసాదంగా ఇవ్వడం వినడానికి వింతగా ఉన్నా, దీని వెనుక ఉన్న ఆర్థిక క్రమశిక్షణ, అపార నమ్మకం ఆసక్తికరంగా ఉంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూనే, వారికి ఒక రకమైన ‘దైవిక పెట్టుబడి’ని అందజేస్తున్నట్లుగా ఈ సంప్రదాయం కనిపిస్తోంది. రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ జిల్లాలో ఉన్న బానోడా బాలాజీ (హనుమాన్) ఆలయం ఇతర పుణ్యక్షేత్రాలకు భిన్నంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ భక్తులకు లడ్డూలు, పండ్లు కాకుండా ‘డబ్బు’ను ప్రసాద రూపంలో అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని..
ఆర్థిక నమ్మకం ఈ ఆలయంలో అనుసరించే పద్ధతి ఇలా ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు హుండీలో సమర్పించే కానుకల నుంచి కొంత భాగాన్ని పూజారి తిరిగి ఆ భక్తులకే ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒక రూపాయి నుంచి వందల వరకు ఎంతైనా ఉండవచ్చు. ఆ ప్రసాదంగా పొందిన డబ్బును భక్తులు తమ పర్సులు లేదా వ్యాపార గల్లా పెట్టెల్లో భద్రంగా దాచుకుంటారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయని, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని బలంగా విశ్వసిస్తారు.

మొక్కులు, తిరిగి చెల్లింపులు..
ఈ సంప్రదాయంలో ఒక రకమైన బాధ్యత కూడా దాగి ఉంది. భక్తులు తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఒకసారి తమ కోరిక నెరవేరిన తర్వాత, లేదంటే వ్యాపారంలో లాభం వచ్చిన తర్వాత.. తాము ప్రసాదంగా పొందిన సొమ్ముకు తమ వంతుగా మరికొంత నగదును జోడించి తిరిగి బాలాజీకి సమర్పిస్తారు. పెరుగుతున్న ప్రాచుర్యం కేవలం రాజస్థాన్ నుంచే కాకుండా మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. హనుమంతుడి ఆశీస్సులతో పాటు లభించే ఈ నాణేలు లేదా నోట్లను తమ విజయానికి పునాదిగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఈ ఆలయానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పుల బాధలు తొలిగిపోవడానికి కూడా ఈ ప్రసాదం తోడ్పడుతుందని అక్కడి వారు చెబుతుంటారు.

CLICK HERE TO READ 1985dec | 40 ఏళ్ల సైనిక అనుభవానికి కేంద్రం గుర్తింపు

CLICK HERE TO READ MORE