పరీక్షల్లో ఫెయిల్ అయితే నిరాశ చెందవద్దు…

తొర్రూరు, ఆంధ్రప్రభ : పరీక్షలు జీవితంలో ఒక భాగం అని, ఫలితాలతో నిరాశ చెందవద్దని ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య అన్నారు.పదో తరగతిలో ఫెయిల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు డివిజన్ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. తరగతులకు హాజరైన విద్యార్థులకు మెటీరియల్ అందజేశారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ…పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా పట్టుదలతో ముందుకు సాగాలని, విఫలం కావడం జీవితం అంతం కాదని, అది కేవలం ఒక దశ మాత్రమేనని ఆయన సూచించారు. విజయం సాధించడానికి అనేక మార్గాలున్నాయని,ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని విద్యార్థులకు తెలిపారు.
ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి జిల్లాలో రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం జెల్ల లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు యాదవ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, జ్యోతి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
