ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఘనంగా ఏర్పాట్లు….
- మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి..
- ప్రముఖ క్రీడాకారులను భాగస్వాములను చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపర్చాలని సీఎం సూచించారు. హైదరాబాద్‌లోని ప్రస్తుత స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల పరిస్థితిని పరిశీలించి.. పోటీల నిర్వహణకు అనుగుణంగా వాటిని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రారంభ, ముగింపు వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసే దిశగా కసరత్తు ప్రారంభించాలని తెలిపారు.
తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు, జాతీయ స్థాయి క్రీడా ప్రముఖులను కూడా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. అతిథులకు అవసరమైన వసతి, రవాణా తదితర సౌకర్యాలతో పాటు మౌలిక వసతులు, క్రీడల నిర్వహణకు సంబంధించి స్పష్టమైన పని విభజన చేసుకుని బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.
20 క్రీడాంశాల్లో పోటీలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రతి క్రీడకు అనువైన పోటీ వేదికలను ముందుగానే గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను చాటేలా, క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించేలా పోటీల నిర్వహణ ఉండాలని సూచించారు.
తెలంగాణలో జరిగే ఈ పోటీలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎనిమిదో సంచికగా నిలవనున్నాయి. గతంలో 2024లో తమిళనాడు, 2025లో బిహార్ ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చాయి. 2025లో తెలంగాణ పతకాల పట్టికలో 13వ స్థానంలో నిలిచింది. ఈసారి సొంతగడ్డపై జరిగే పోటీలను సమర్థంగా నిర్వహించడంతో పాటు రాష్ట్ర యువ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ సోనీబాల దేవి తదితరులు పాల్గొన్నారు.
