ఏపీఎల్-5లో దుమ్మురేపిన భీమవరం బుల్స్

ఏపీఎల్-5లో దుమ్మురేపిన భీమవరం బుల్స్

వైజాగ్ లయన్స్‌పై 104 పరుగుల భారీ విజయం

తుంగభద్రపై కాకినాడ కింగ్స్ రెండో గెలుపు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ:
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్-5లో ఐదో రోజు పోటీలు అభిమానులకు వినోదాన్ని పంచాయి. తొలి మ్యాచ్‌లో భీమవరం బుల్స్ ఏకపక్ష ప్రదర్శనతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌ను 104 పరుగుల భారీ తేడాతో ఓడించగా, రెండో మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ 34 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్‌ను మట్టికరిపించి సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.

వైజాగ్‌పై భీమవరం బుల్స్ ఘన విజయం

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భీమవరం బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. ఓపెనర్ రేవంత్ రెడ్డి 34 బంతుల్లో 58 పరుగులతో శుభారంభం అందించగా, బి. సాత్విక్ కేవలం 29 బంతుల్లో 63 పరుగులు చేసి ఎనిమిది సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో భీమవరం బుల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వైజాగ్ బౌలర్లలో విజయ్, వినయ్ చెరో రెండు వికెట్లు సాధించారు.

220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వైజాగ్ లయన్స్ ఆరంభం నుంచే ఒత్తిడిలో పడింది. మహిప్ కుమార్ 24 బంతుల్లో 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు 17.5 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది.

భీమవరం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వైజాగ్‌కు కోలుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ విజయంతో భీమవరం బుల్స్ పాయింట్ల పట్టికలో కీలక అడుగు వేయగా, సింహాద్రి వైజాగ్ లయన్స్ వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన బి. యశ్వంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఐదో రోజు రెండో మ్యాచ్‌లో కాకినాడ కింగ్స్ సమిష్టి ప్రదర్శనతో తుంగభద్ర వారియర్స్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కాకినాడ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ఓపెనర్లు అర్జున్ టెండూల్కర్ (35 బంతుల్లో 51), అభిషేక్ రెడ్డి (34 బంతుల్లో 32) సహకారంతో మంచి ఆరంభం అందుకుంది.

చివరి ఓవర్లలో జి. సమన్విత్ కేవలం 7 బంతుల్లో 27 పరుగులు చేసి నాలుగు భారీ సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా కాకినాడ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తుంగభద్ర బౌలర్లలో మల్లికార్జున, శ్రీనివాస్ చెరో రెండు వికెట్లు తీశారు.

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తుంగభద్ర వారియర్స్‌కు సమాన్యు దత్త (45), ఆనంద్ జోషి (33) పోరాడినా మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. కాకినాడ బౌలర్లలో ఆంజనేయులు, ఆశిష్, గిరి ప్రసాద్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జి. సమన్విత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Leave a Reply