- మత్స్యకార భరోసా
- అన్నదాత సుఖీభవ
- తల్లికి వందనం
- మెగా డీఎస్సీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రైతులు, మత్స్యకారులు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యశాఖ భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేయనుందని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోసం ఈ సాయం అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచి ఈ సాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
మే నెలలో అన్నదాత సుఖీభవ:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మే నెలలో రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
జూన్‌లో తల్లికి వందనం:
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్:
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కోడ్ ముగిసిన వెంటనే 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు.