హైదరాబాద్లో.. సన్నబియ్యం లేవ్
లబ్ధిదారులకు దొడ్డు బియ్యమే
రాష్ట్రమంతా సన్నబియ్యం పంపిణీ
అడ్డంకిగా మారిన ఎమ్మెల్సీ ఎన్నిక
కోడ్ కారణం అంటున్న దుకాణాదారులు
ఓటు వేసిదేమో ప్రజాప్రతినిధులు
నిబంధనలు వర్తించేది పేదలకా?
సర్కారు తీరుపై లబ్ధిదారుల ఆగ్రహం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ఉగాది రోజున రాష్ట్రమంతటా సన్న బియ్యం పథకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సన్న బియ్యం పంపిణీ ఏప్రిల్ నెల కోటా వచ్చేసింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులంతా సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. కానీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పుణ్యమా అని హైదరాబాద్ సిటీ లబ్ధిదారులు మాత్రం ఈనెల దొడ్డు బియ్యమే అందుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 6,39,337 కార్డులున్నాయి. ఇందులో 22,98,064 లబ్ధిదారులున్నారు. ఒక్కో లబ్ధిదారునికి ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. 13,788.384 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది.
ఎమ్మెల్సీ ఎన్నికతో..
ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్డుదారులకు రేషన్ డిపోల ద్వారా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. అయితే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో సన్నబియ్యం పంపిణీని నిలిపివేసినట్టు చౌకధరల దుకాణాదారులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ కార్డుదారులందరికీ ఈ నెల దొడ్డు బియ్యం మాత్రమే అందించారు. కాగా, హైదరాబాద్ జిల్లాలో స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెలలో జరగనుంది. ఎన్నికల నియామావళిని ఈ జిల్లాలో ఈసీ అమలు చేస్తోంది. ఎన్నికల నియామావళి ప్రకారం కొత్త పథకాలు అమలు చేయకూడదనే రూల్స్ ఉన్నాయి. దీంతో ఉగాది నుంచి అమల్లోకి వచ్చిన సన్న బియ్యం పంపిణీ పథకం నిలిచిపోయింది. మే నెల నుంచి ఇక్కడ సన్నబియ్యం పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఓటరును ప్రభావితం చేస్తేనే..
సాధారణంగా ఎన్నికల నియమావళి ప్రకారం.. ఓటరును ప్రభావితం చేసే అంశాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. ప్రజాప్రతినిధులు మాత్రమే ఓటర్లుగా ఉన్నప్పుడు సన్న బియ్యం పథకం అమలు చేసినంత మాత్రనా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదు. సన్న బియ్యం అందించేది పేదలకు. ప్రజాప్రతినిధులు ఓటు వేస్తే పేదలకు ఈ నిబంధనలు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకుని సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు లభ్దిదారులు కోరుతున్నారు.