అంతర్జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్…

నిజామాబాద్ క్రైం, ఆంధ్రప్రభ : రెండు రాష్ట్రాలు, పలు జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి లోపలి రాగి తీగలు (కాపర్ కాయిల్స్) దొంగిలిస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అరెస్టుతో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో నమోదైన మొత్తం 64 దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సి.హెచ్. సాయి చైతన్య వెల్లడించారు.
వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు

పోలీసుల కథనం ప్రకారం.. మే 21 సాయంత్రం రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ తన సిబ్బందితో కలిసి సాతాపూర్ బైపాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగులను తనిఖీ చేయగా ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి దొంగిలించిన కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి.
రెండేళ్లుగా కొనసాగుతున్న చోరీలు
విచారణలో నిందితులు గత రెండేళ్లుగా ముఠాగా ఏర్పడి ఒంటరిగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేసి ధ్వంసం చేసి, లోపలి రాగి కాయిల్స్‌ను దొంగిలిస్తున్నట్లు అంగీకరించారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు
- నిజామాబాద్ జిల్లా – 38 కేసులు
రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాలు. - కామారెడ్డి జిల్లా – 20 కేసులు
కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, భిక్కనూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్దకొడప్‌గల్ ప్రాంతాలు. - మెదక్ జిల్లా – 4 కేసులు
మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ప్రాంతాలు. - సిద్దిపేట జిల్లా – 2 కేసులు
అక్కన్నపేట ప్రాంతం.
దొంగిలించిన రాగి కాయిల్స్‌ను బోధన్, నిజామాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని స్క్రాప్ దుకాణదారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితులు
- వనం శైలు (మెదక్ టౌన్)
- జగన్నాథం శరయ్య అలియాస్ శ్రీనివాస్ (మెదక్ టౌన్)
- వనం పోశెట్టి (బోధన్)
- ధనా శ్రీకిరణ్ (మెదక్ టౌన్)
- దాసరి పోచయ్య (నారాయణఖేడ్, మెదక్ జిల్లా)
రిసీవర్లు
- సయ్యద్ అక్బర్ హుస్సేన్ (బోధన్)
- షేక్ మహబూబ్ (నిజామాబాద్)
ఇంకా మలప్ప మాస్టర్ అలియాస్ గౌతమ్, తాయప్ప ధంగల్ అనే ఇద్దరు స్క్రాప్ వ్యాపారులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
- 80 కిలోల కాపర్ కాయిల్స్
- 3 మోటార్ సైకిళ్లు
- 4 మొబైల్ ఫోన్లు
పోలీసులకు సీపీ అభినందనలు
ఈ అంతర్జిల్లా ముఠాను పట్టుకుని 64 కేసులను ఛేదించిన పోలీస్ అధికారులను సీపీ సాయి చైతన్య అభినందించారు. బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, బోధన్ రూరల్ ఎస్ఐ మచేందర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విఠల్ తదితర పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
