మాజీ డిప్యూటీ సీఎం వరద ప్రాంతాల పరిశీలన
మాజీ డిప్యూటీ సీఎం వరద ప్రాంతాల పరిశీలన
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా లో రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ చెరువు మత్తడిని, బాంజీపేట వాగుపై ఉన్న లోలెవల్ వంతెనను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ రోజు పరిశీలించారు. దెబ్బతిన్నరోడ్లు, గండ్లు పడిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
బాంజీపేట వాగు వరద ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయిన లోలెవల్ వంతెనను పరిశీలించారు. వాగు పై శాశ్వతంగా ఉండే విధంగా హైలెవల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణం జరిగే వరకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డు డైవర్షన్ కు కూడా అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. వంతెన నిర్మాణానికి సుమారు రూ.10 కోట్లు అవుతుందని ఎమ్మెల్యే ప్రాథమికంగా అంచనా వేశారు. ఆయనతోపాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
