గల్ఫ్ దేశాల నుంచే అత్యధిక విదేశీ సంపద
గల్ఫ్ దేశాల నుంచే అత్యధిక విదేశీ సంపద
న్యూయార్క్ : విదేశాలలో ఉన్న వారి నుండి రెమిటెన్సుల రూపంలో విదేశీ మారకపు నిధులను అందుకుంటున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో దశాబ్ద కాలానికి పైగా భారతదేశం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2024లో కూడా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
2024లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఉన్న 1.9 కోట్ల మంది భారతీయ వలస కార్మికుల నుండి దేశానికి 137 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 13,01,500 కోట్లు)కు పైగా రెమిటెన్సులు వచ్చి చేరినట్లు ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ వలసల నివేదిక 2026 (వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026) బుధవారం వెల్లడించింది.
ఈ విషయంలో 100 బిలియన్ డాలర్ల మార్కును దాటిన ఏకైక దేశంగా భారతదేశాన్ని పేర్కొంది. ప్రపంచ వలసల నివేదిక 2026 ప్రకారం గత దశాబ్ద కాలంగా రెమిటెన్సుల రూపంలో విదేశీ మారకపు నిధుల ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో భారతదేశం స్థిరంగా అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోంది. మెక్సికో దాని తరువాత స్థానంలో ఉంది.
2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రెమిటెన్సులు అందుకున్న మొదటి నాలుగు దేశాలలో భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్ ఉన్నాయి. 2024లో భారత్, మెక్సికో, ఫిలిప్పీన్స్ కలసి 245 బిలియన్ డాలర్లకు పైగా రెమిటెన్సులను స్వీకరించాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు వలస కార్మికుల సంపాదన ఏ స్థాయిలో ప్రవహిస్తుందో ఇది స్పష్టం చేస్తోంది.
దశాబ్ద కాలపు వృద్ధి ధోరణి
భారతదేశ రెమిటెన్స్ ప్రవాహాలు సంవత్సరాలుగా భారీగా విస్తరించాయి. ఇది ప్రవాస భారతీయుల సంఖ్య పెరగడం, విదేశాలలో వారి ఆదాయ స్థాయిల్లో వస్తున్న పెరుగుదలను సూచిస్తుంది. 2010లో సుమారు 53.5 బిలియన్ డాలర్లుగా ఉన్న రెమిటెన్సుల ప్రవాహాలు 2015లో 68.9 బిలియన్ డాలర్లకు, 2020లో 83.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024లో అవి 137 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
2024లో దక్షిణాసియాలో రెమిటెన్సుల వృద్ధి అత్యంత వేగంగా సుమారు 11.8 శాతంగా నమోదైనట్లు ప్రపంచ వలసల నివేదిక 2026 వెల్లడించింది. భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు పెద్దఎత్తున రెమిటెన్సులు రావడమే దీనికి ప్రధాన కారణంగా తెలిపింది.
ప్రధాన మూల దేశాలు
భారతదేశానికి ప్రధానంగా గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కతార్, కువైట్‌ల నుంచి విదేశీ డబ్బు అధికంగా వస్తుండగా, ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడాల నుంచి వస్తోంది.
విదేశాలలో పని చేస్తున్న కార్మికుల నుండి విదేశీ డబ్బు అందుకుంటున్న రాష్ట్రాలలో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ నాలుగవ స్థానంలో, ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి.
విదేశీ డబ్బు పంపే ప్రధాన వనరులుగా అధిక ఆదాయ దేశాలు ఆధిపత్యం కొనసాగించాయి. 2024లో 100 బిలియన్ డాలర్లకు పైగా విదేశాలకు పంపిన డబ్బుతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వలస కార్మికులు, నిపుణులు కేంద్రీకృతం కావడమే దీనికి కారణమని నివేదిక వివరించింది.
అమెరికా తరువాత సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, జర్మనీ ఇతర ప్రధాన దేశాలుగా ఉన్నాయి. ఈ విదేశీ డబ్బు ప్రవాహాలు డబ్బును స్వీకరించే దేశాలలో కుటుంబ వినియోగం, విద్య, ఆరోగ్య సంరక్షణ, చిన్న తరహా సంస్థలకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
యూఏఈలో 30 లక్షల మందికి పైగా భారతీయులు
ప్రపంచ దేశాలన్నింటిలో స్వదేశీ జనాభా కంటే వలస కార్మికులు అత్యధికంగా ఉన్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రసిద్ధిగాంచింది. ఈ దేశంలో 80 లక్షల మందికి పైగా వలస కార్మికులు ఉన్నారు. వీరి సంఖ్య దేశ జనాభాలో 74 శాతానికి పైగా ఉంటుంది. అందులో 30 లక్షల మంది భారతీయులే ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1.8 కోట్ల నుంచి 1.9 కోట్ల మంది భారతీయులు వలస కార్మికులుగా పని చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉండగా, ఆ తరువాత అమెరికాలో ఉన్నారు. సౌదీ అరేబియా మూడవ స్థానంలో ఉంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. ఇది ప్రపంచ జనాభాలో 3.7 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
