వికారాబాద్‌లో ఎర్రమట్టి అక్రమ రవాణా…

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామంలో సబ్‌స్టేషన్ పక్కన, సుధ ఫ్యాక్టరీ సమీపంలోని ప్రభుత్వ భూమి నుంచి రాత్రివేళల్లో ఎర్రమట్టి అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని మోకీలా, మొయినాబాద్ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

రాత్రిపూట టిప్పర్ల రాకపోకల వల్ల భారీ శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే ఎర్రమట్టి ధూళి పంటపొలాలు, పూల తోటలు, ఆకుకూరలపై పడడంతో చేతికొచ్చిన పంట నష్టపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ రవాణాపై స్పందించాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. రాత్రివేళల్లో టిప్పర్లు సంచరిస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మహిళలు, రైతులు ఆరోపించారు.

సంబంధిత ఎమ్మార్వో అనుమతి లేకుండానే గత కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అక్రమ ఎర్రమట్టి రవాణాను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.