ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణం..

ఆంధ్రప్రభ, విజయవాడ : సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు ఇళయరాజా విజ‌య‌వాడలో కాన్సర్ట్ నిర్వ‌హించినందుకు న‌గ‌ర ప్ర‌జ‌ల త‌రుఫున విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు కృత‌జ్ఞ‌తలు తెలిపారు. విజయవాడ బందర్‌ రోడ్డులోని జీఆర్టీ గ్రాండ్ హోటల్‌లో ఆదివారం మ్యూజిక్ మాస్ట్రో, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ను డిప్యూటీ స్పీక‌ర్ రఘురామకృష్ణరాజు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇళయరాజా కు పుష్పగుచ్చం అందజేయ‌టంతో పాటు , శాలువా కప్పి స‌న్మానించి కొండ‌ప‌ల్లి బొమ్మ బ‌హుక‌రించారు. అనంతరం ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ.. ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణం. ఆయన సంగీతం భావోద్వేగాల భాష. సంగీతం అంటే ఇళయరాజా … మెలోడీ అంటే రాజా … భావం అంటే ఆయన సృష్టి. ఇళయరాజా అనే పేరు వినగానే మనసు మోగే స్వరాల ప్రేరణా గాధ మన ముందుకొస్తుంది అని పేర్కొన్నారు.

భారతీయ సంగీత చరిత్రలో అజరామరమైన స్వరకర్తగా ఇళయరాజా గుర్తింపు పొందారని ఎంపీ శివనాథ్ తెలిపారు. ఇళయరాజా గీతాలు తరతరాల మనసుల్లో మెలోడీ మంత్రాలుగా నిలిచిపోయాయి. ఆయన సృష్టి విశ్వవ్యాప్తమైందని, భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండరీ కంపోజర్ ఇళయరాజాకి సంగీత ప్రపంచం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. వెయ్యికి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చిన సంగీత మాంత్రికుడు ఇళయరాజా ప్రతిభకు ప్రపంచం సాక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. ఇళయరాజా గారి వ్యక్తిత్వం, ఆయన సంగీతం రెండూ భారతీయ సంస్కృతికి సజీవ చిహ్నాలు, అని ఎంపీ పేర్కొన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ సోద‌రి కేశినేని శ్రీదేవిల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఇళయరాజా

Leave a Reply